కె. నౌషిత (Class X)

బుధ, 30 ఆగష్టు 2023

గుంటూరు – ద క్రాస్ వర్ద్ స్కూల్ తో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. అక్కడి ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులు తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. 8వ తరగతికి చెందిన కృష్ణవేణి తాను తెలుగుభాష గొప్పదనాన్ని వివరిస్తూ ఒక నాటకాన్ని రూపొందించింది. దాన్ని 8వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. ఎన్ని దేశాలు తిరిగినా మన మాతృ భాషను మరువరాదు అనే సందేశాన్ని ఇచ్చింది ఈ నాటకం. 9వ తరగతికి చెందిన అభివర్షిణి ‘మా తెలుగు తల్లీ’ అనే పాటకు చేసిన శాస్త్రీయ నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఇందులో 7వ తరగతికి చెందిన తేజ అక్షర అనే విద్యార్థిని తెలుగు తల్లి వేషధారణలో అద్భుతంగా కనిపించింది. 9, 10వ తరగతి విద్యార్థులు తెలుగు గొప్పదనాన్ని వివరిస్తూ మధురంగా గానం చేశారు. దీనికి తెలుగు ఉపాధ్యాయురాలు  తమ కోకిలవంటి తియ్యని స్వరాన్ని అందించారు. 10వ తరగతికి చెందిన నౌషిత అనే విద్యార్థిని గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు గారి గురించి చక్కని ప్రసంగం చేసింది.

తెలుగుభాషను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అధికంగా మాట్లాడతారు. తెలుగుభాషలోని కమ్మదనం, తియ్యదనం మరే భాషలోను లేదు. తెలుగు భాష అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది. అమ్మ అనే మాటకు ప్రాణం పోసింది మన తెలుగు భాష. ఆదికవి నన్నయ్య నుండి ఆధునిక కవుల వరకు ఎంతోమంది తెలుగు భాష సాహిత్య సేవ చేశారు. వారి అందరి కలం నుండి అందంగా జాలువారి, శివుని శిఖ నుండి ప్రవహిస్తున్న గంగలా ఎడ తెగకుండా తెలుగు సాహిత్యామృతం ప్రవహిస్తుంది.

ఆదిలో ఎక్కువ సంస్కృతాంధ్ర  పదాలతో రచనా వ్యాసంగం జరిగేదే కానీ అది ప్రజలు చదవడానికి కష్టంగా ఉండేది. అది చూసిన గిడుగు వేంకట రామ్మూర్తి గారు ఎంతో కృషి చేసి తెలుగు భాషను వ్యావహారిక భాషగా చేశారు. భాష యొక్క గొప్పదనాన్ని దాని సాహిత్యాన్ని బట్టి చెబుతారు. తెలుగు భాషలోని కవిత్వాలు, పద్యాలు, సామెతలు, పొడుపు కథలు, కథలు, నవలలు ఇలాంటివి ఎన్నో అద్భుతమైన రచనలు ఉన్నాయి. మనం తెలుగు నేర్చుకోవడానికి ఎంతో కృషి చేయనక్కరలేదు.

మనం పుట్టినప్పుడి నుండి మరణించే వరకు మనం భాష నేర్చుకుంటూనే ఉంటాము. మనం తెలుగుభాషను మరిచిపోతే మనం మన కన్న తల్లిని మరిచినట్టే. కాబట్టి ఎక్కడ ఉన్నా, ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగుభాషను మాత్రం మరవకూడదు.

శ్రీ కృష్ణ దేవరాయలువారు మనకి ఎప్పుడో చెప్పారు “దేశ భాషలందు తెలుగు లెస్స’’  అని. తర్వాత విద్యార్థులంతా కలిసి తెలుగు భాషను గౌరవిద్దాం. తెలుగులోనే మాట్లాడుదాం. తెలుగు మాధుర్యాన్ని ముందుతరాల వారికి అందిద్దాం అని ప్రతిజ్ఞ పూనారు.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started