తెలుగు భాష ఎంతో స్వచ్ఛమైనది, తీయనైనది. అందుకే ఎంతో మంది కవులు, రచయితలు తెలుగు భాషలో ఎన్నో కవిత్వాలు, రచనలు, పాటలను రచించారు. ఇంత ఘనమైన చరిత గలది మన తెలుగు భాష.

“దేశ భాషలందు తెలుగు లెస్స! అని ఆ నాటి చక్రవర్తియైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను కొనియాడారు. అంతేకాదు.. తెలుగుభాషలో “ఆముక్త మాల్యద” అనే పుస్తకాన్ని తన స్వహస్తాలతో రచించారు.

” ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ” అని రాయప్రోలు సుబ్బారావుగారు మాతృ భూమి గురించి మాతృభాష గురించి గొప్పగా చెప్పారు.

అంతేకాదు తెలుగు భాషను వ్యాప్తి చెందించాలని, మన మాతృభాష గొప్పతనాన్ని వేనోళ్ళ పొగడాలని గిడుగు  రామమూర్తి పంతులుగారు తెలుగు భాషలో అనేక రచనలు చేశారు. తెలుగు భాష వ్యాప్తికి ఎంతో పోరాడారు. ఆయన జన్మదినాన్నే తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము.  (ఆగష్టు-29).

తెలుగు భాష ఎంత గొప్పదంటే మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఔన్నత్యాన్ని మాతృభాష ద్వారా మాత్రమే సంతృప్తిగా వ్యక్తపరచగలం. ఈ రోజుల్లో ఇంగ్లీషు మోజులో పడి తెలుగు భాషను మరచి పోతున్నారు. ఇంగ్లీషు అవసరమే కానీ మన తెలుగు- భాషను మరచిపోవడం సమంజసం కాదు. ఇంత గొప్ప తెలుగు భాష తరతరాలకు కొనసాగాలని ఆశిస్తూ వేడుకలను ప్రారంభించాము.

మొట్ట మొదటగా, గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయురాలు గారు తెలుగు భాష యొక్క ప్రాధాన్యతను, ఆవశ్యకతను తెలియజేశారు. ప్రతి తల్లి తన బిడ్డను కాపాడుకున్నట్లు, తెలుగు భాషను కాపాడుకోవాలి అని ఆమె అన్నారు. అలాగే తెలుగు ఉపాధ్యాయులైన ఎలిజబెత్, పావని గార్లు తెలుగు భాష గురించి కొన్ని విలువైన మాటలను అందించారు.

ఆ తరువాత 9వ తరగతికి చెందిన అభివర్షిణి మా తెలుగు తల్లికి, పాటకు ఎంతో నేర్పుతో చక్కని హావభావాలతో కూచిపూడి నృత్యం చేసింది. ఈ ప్రదర్శనలో భరతమాతగా 7వ తరగతికి చెందిన తేజ అక్షర ఎంతో చక్కగా నటించింది. 8వ తరగతికి చెందిన కృష్ణవేణి రచించిన నాటకాన్ని 7, 8వ తరగతికి చెందిన విద్యార్థులు ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు.

ఈ నాటకం తరువాత 10వ తరగతికి చెందిన నౌషిత తెలుగు భాష గురించి ఒక ఉపన్యాసాన్ని అందించింది. ఆ తర్వాత 8వ తరగతికి చెందిన మణికంఠ కొన్ని పొడుపు కథలను అడిగాడు విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా సమాధానాలిచ్చారు. ఇంకా, 9, 10వ తరగతి విద్యార్థినులు తెలుగు ఉపాధ్యాయురాలు అయిన ఎలిజబెత్ గారితో కలసి తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసే గీతాన్ని  ఆలపించారు.

ఈ విధంగా మా పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

శరణ్య

Class X

Leave a comment

Design a site like this with WordPress.com
Get started